కార్తీ ‘చినబాబు’ మూవీ రివ్యూ

0
597

తెలుగులో మంచి మార్కెట్ ఉన్న తమిళ నటుల్లో ఒకరు సూర్య తమ్ముడు కార్తీ. గతంలో ఆయన నటించిన యుగానికి ఒక్కడు, ఆవారా, నా పేరు శివ, ఖాకీ లాంటి సినిమాలను తెలుగు ప్రేక్షకులు ఆదరించారు. నాగార్జునతో కలిసి ఊపిరి మూవీలో నటించిన కార్తి.. తాజాగా ‘చినబాబు’గా మన ముందుకొచ్చారు. `చిన‌బాబు` అనే టైటిల్ తెలుగువారికి కొత్త‌కాదు. ఇప్ప‌టిదాకా కార్తి న‌టించిన ఏ చిత్రంలోనూ కంప్లీట్ ఫ్యామిలీ క‌నిపించ‌దు.తొలిసారి ఫుల్ ప్లెడ్జ్ డ్ ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్‌లో న‌టించారు కార్తి. త‌మిళ సంప్ర‌దాయాలు తెలుగు నేటివిటీకి స‌రిపోయాయా? కుటుంబ కథా చిత్రంతో మన ముందుకొచ్చిన కార్తి హిట్ కొట్టారా..? లేదా అన్నది మన సమీక్షలో తెలుసుకుందాం.

పెనుగొండ రుద్రరాజు (సత్యరాజ్‌) రైతు. ఇద్దరు భార్యలు, ఐదుగురు కూతుళ్లు, ఒక కొడుకు ఉన్న పెద్ద కుటుంబ యజమాని. ఎప్పటికైనా తన కూతుళ్లు, అల్లుల్లు.. వాళ్ల పిల్లలను ఇంటికి పిలిచి అందరితో కలిసి ఓ ఫ్యామిలీ ఫొటో తీయించుకోవాలని ఆశపడుతుంటాడు. రుద్రరాజు కొడుకు కృష్ణంరాజు (కార్తీ) ‘రైతే దేశానికి ఆధారం’ అని నమ్మే ఆదర్శ రైతు. రుద్రరాజు ఇద్దరు కూతుళ్లు తమ అమ్మాయిలను కృష్ణంరాజు కు ఇచ్చి పెళ్లి చేయాలనుకుంటారు. కానీ కృష్ణంరాజు, నీల నీరధ(సయేషా)ను ఇష్టపడతాడు.

దీంతో కుటుంబంలో గొడవలు మొదలవుతాయి. అదే సమయంలో నీల నీరధ బావ, సురేంద్ర రాజు (శత్రు)ను ఓ హ్యతకేసులో కృష్ణం రాజు అరెస్ట్‌ చేయిస్తాడు. దీంతో ఎలాగైన ప్రతీకారం తీర్చుకోవాలన్న కసితో సురేంద్ర, రుద్రరాజు కుటుంబంలో మొదలైన గొడవలు మరింత పెద్దవి చేసి అందరిని విడదీయాలని, కృష్ణంరాజును చంపాలని ప్రయత్నిస్తాడు. ఈ సమస్యల నుంచి కృష్ణంరాజు తన కుటుంబాన్ని ఎలా కాపాడుకున్నాడు..? ఎలా తిరిగి ఒక్కటి చేశాడు..? అన్నదే మిగతా కథ.

చినబాబు గా కార్తీ ఒక రైతుగా చాలా కొత్తగా కనిపించాడు. కార్తీ తన పాత్రకు పూర్తిగా న్యాయం చేసాడు. తను ఎంతో ప్రేమించిన ఎద్దులు చనిపోయిన సమయంలో వేదన పడే రైతుగా కార్తి నటన బాగుంది. కార్తీ స్క్రీన్ ప్రజెంటేషన్ చాలా బావుంది. హీరోయిన్ సయేశా సైగల్ తో కెమిస్ట్రీ కూడా కార్తీ బాగా పండించాడు. ఇంతకుముందు పోలీస్ గా, మాంత్రికుడిగా, అన్న కోసం త్యాగం చేసే తమ్ముడిగా, ఒక ప్రేమికుడిగా నటించి మెప్పించిన కార్తీ ఇప్పుడు రైతుగా పంచె కట్టు లో అదరగొట్టేసాడనే చెప్పాలి. ఆర్గానిక్ వ్యవసాయ ద్వారా లక్షలు సంపాదించ్చు… రైతు అని చెప్పుకోవడానికి ఎలాంటి సిగ్గు పడక్కర్లేదని ఒక మెస్సేజ్ ఉన్న పాత్రకు కార్తీ ప్రాణం పెట్టాడు.

హీరోయిన్ సాయేషా ఒక పల్లెటూరి అమ్మాయిలా తన పాత్రలో ట్రెడిషినల్ గా కనిపించింది. చినబాబు ప్రేయసిగా సయేషా ఫర్వాలేదనిపించింది. కార్తీతో కలిసి రొమాంటిక్ సన్నివేశాల్లో మెప్పించింది. కార్తీ తండ్రిగా సత్యరాజ్ చక్కటి నటన కనబరిచారు. కుటుంబ పెద్దగా, గ్రామ పెద్దగా సత్యరాజ్ ఎప్పటిలాగే అద్భుతంగా నటించి మెప్పించాడు. ఇక చినబాబు మేనల్లుడిగా, ఎప్పుడూ అతడినే అంటిపెట్టుకుని తిరిగే స్నేహితుడిగా సూరీ కూడా ఆకట్టుకున్నాడు. విలన్ గా శత్రు, చినబాబు తల్లిగా విజి తమ పాత్రలకు పూర్తి న్యాయం చేశారు. ఇక మిగతా నటీనటులు తమ పరిధిమేర నటించి మెప్పించారు.

దర్శకుడు పాండిరాజ్ ఏదో వ్యవసాయం గురించి అక్కడక్కడా చూపించేసి వదిలిపెట్టకుండా… సినిమా మొత్తం వ్యవసాయమే ప్రధానం గా కథను నడిపించిన తీరు అభినందనీయం. పల్లెటూరి వాతావరణంలో చినబాబును అందంగా తెరకెక్కించారు. అటు వ్యవసాయాన్ని ప్రధానంగా చూపిస్తూనే కుటుంబం గురించి కూడా చాలా చక్కగా ప్రెజెట్ చేసాడు దర్శకుడు. కుటుంబ సభ్యుల మధ్య ఉన్న బాండింగ్ ని పర్ఫెక్ట్ గా చూపించాడు. ఇక దర్శకుడు ఎలా చెబితే అలా కార్తీ చినబాబుగా అద్భుతమైన పర్ ఫార్మెన్స్ ఇచ్చి సినిమాని మరో స్థాయికి తీసుకెళ్లాడు. అలాగే దర్శకుడు ఈ కుటుంబ కథలోనే కామెడీని కూడా బాగా బ్యాలెన్స్ చేసాడు.

సినిమా పూర్తిగా తమిళ ప్రేక్షకులను దృష్టిలో పెట్టుకునే తెరకెక్కించినట్టుగా అనిపిస్తుంది. నేటివిటి పరంగా తెలుగు ప్రేక్షకులకు కనెక్ట్ అవ్వటం కాస్త కష్టమే. నటీనటులు అంతా తమిళ వారే కావటం కూడా ఇబ్బంది పెడుతుంది. కార్తీ నుంచి ఫ్యాన్స్ ఆశించిన కామెడీ, రొమాన్స్ లాంటి అంశాలకు లోటు లేకుండా జాగ్రత్త పడ్డాడు.మరి ఈ సినిమాని తెలుగు ప్రేక్షకులు ఎంతవరకు ఆదరిస్తారు అనేది మాత్రం ఒక్క వారం ఆగితేనే తెలుస్తుంది. సూర్య కథ మీద నమ్మకంతో తమ్ముడి కోసం భారీగానే ఖర్చు చేసి సినిమాను నిర్మించారు. ఏ పండుగ సీజ‌న్‌లోనైనా ఈ సినిమా విడుద‌లై ఉంటే త‌ప్పకుండా భారీ విజ‌యాన్ని మూట‌గ‌ట్టుకుని ఉండేది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here