మీ కిడ్నీలో రాళ్లు ఉన్నాయో …! లేవో ….! ఈ విధంగా తెలుసుకోండి.

0
488

ఇటీవలి కాలంలో కిడ్నీల్లో ఏర్పడిన రాళ్ల కారణంగా చాలా మంది సతమతమవుతున్నారు. అయితే కొంత మంది రాళ్లు. ఏడెనిమిది మి. మీటర్లు పెరిగే దాకా డాక్టర్‌ను సంప్రతించడమే లేదు. దీనికి రాళ్లు ఏర్పడిన తాలూకు లక్షణాలేవీ తెలియకపోవడం కారణమా? లేక ఆ లక్షణాల్ని వీళ్లు నిర్లక్ష్యం చేస్తారా? ఇంతకీ ఆ లక్షణాలు ఎలా ఉంటాయో, వాటిని ఏ మేరకు గుర్తించవచ్చో చెప్పండి?

రక్తంలో క్యాల్షియం, పాస్పరస్‌, యూరిక్‌ యాసిడ్‌, లవణాల మోతాదు మించినప్పుడు మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడతాయి. అయితే, రాళ్లు ఏర్పడ టం అన్నది మూత్రపిండాల్లోనే జరిగినా, వాటిల్లోంచి కొన్ని కిందికి జారి, మూత్రాశయంలోకి, మూత్రనాళంలోకి చేరుతాయి. కొందరిలో ఈ రాళ్లు ఏర్పడటానికి మూత్రవ్యవస్థ ఇన్‌ఫెక్షన్లకు గురికావడం కూడా కారణం కావచ్చు. అయితే ఈ రాళ్లు, మూత్రనాళపు సున్నితమైన పొరను నిరంతరం రాపిడికి గురిచేయడం ద్వారా బాగా దెబ్బతీస్తాయి. అందుకే ఆ విషయాన్ని ముందే గమనించడం చాలా అవసరం. అయితే కొన్ని ప్రత్యేక లక్షణాల ద్వారా మూత్రపిండాల్లో రాళ్లు ఉన్నదీ లేనిదీ ముందే గమనించవచ్చు. ఆ లక్షణాలు… నొప్పి, వీపు కింది భాగంలో మొదలై అది పొత్తి కడుపుదాకా వ్యాపిస్తుంది. దీనివల్ల వృషణాల్లోనూ, పురుషాంగంలోనూ మంట, పోటు వేధిస్తాయి.

స్త్రీలలో అయితే జననాంగం వరకూ మంట ఉంటుంది. పొత్తి కడుపు నుంచి పురీషనాళం వరకు నొప్పి తెరలు తెరలుగా వస్తూ, తీవ్రమవుతుంది. కాకపోతే ఈ నొప్పి నిరంతరంగా కాకుండా, కాసేపు ఉంటూ, మరికాసేపట్లో తగ్గుతూ ఉంటుంది. మౌలికంగా ఈ నొప్పి కిడ్నీ నుంచి మూత్రాశయం వరకు రాయి మూత్రనాళలంలో కదులుతూ ఉండడం వల్ల కలుగుతుంది. కొందరికి, వాంతులు, వణుకు, జ్వరం, కడుపులో తిప్పుతున్న భావన ఉంటాయి. మూత్ర విసర్జన సమయంలో భరించరాని నొప్పి కూడా ఉంటుంది. రాయి వల్ల కలిగే రాపిడితో నడుము, పొత్తి కడుపు బాగా సున్నితమైపోయి తాకినా భరించలేనంతగా నొప్పి కలుగుతుంది. కొందరికి మూత్రంలో రక్తం కూడా పడవచ్చు. ఈ లక్షణాల ఆధారంగా కిడ్నీలో రాళ్లు ఉన్నట్లు గ్రహించి వెంటనే డాక్టర్‌ను సంప్రదిస్తే, సమస్య నుంచి చాలా తొందరగా బయటపడే అవకాశాలు ఉంటాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here