పట్టాలు దాటుతున్నారా… ఆగండి… ఆగండి.. ఇది మీ కోసమే…

0
634

టికెట్‌ లేని ప్రయాణం నేరం. ఆరు నెలల జైలు శిక్ష, వెయ్యి రూపాయల జరిమానా విధిస్తారని ప్రతి రైల్వే స్టేషన్‌లో అనౌన్స్‌ చేయడం మనం వింటూనే ఉంటాం. టికెట్‌ లేని ప్రయాణంతోపాటు నిర్లక్ష్యంగా, ఉద్దేశపూర్వకంగా రైలు పట్టాలు దాటుతున్న వారికి సైతం శిక్ష విధించేందుకు రైల్వే శాఖ సిద్ధమైంది. తొలి విడతలో ఈ విఽధానాన్ని పశ్చిమ రైల్వే విభాగంలో అమలు చేయనున్నట్టు తెలిసింది. రైలు ప్రమాదాలను నివారించడంలో భాగంగా ఆ శాఖ కొన్నేళ్లుగా భద్రతా అంశాలపై అవగాహన కార్యక్రమాలు, కళా ప్రదర్శనలు నిర్వహిస్తోంది. ‘ఆగి ఉన్న రైలునే ఎక్కండి.. పరుగెత్తుతూ రైలు ఎక్కి ప్రాణాల మీదకు తెచ్చుకోకండి’.. అంటూ కరపత్రాలు, వాల్‌పోస్టర్ల ద్వారా ప్రచారం చేస్తూ అనౌన్స్‌ చేస్తూనే ఉన్నారు. వీటితోపాటు తాజాగా రైలు పట్టాలపై జరుగుతున్న ప్రమాదాలు, ఆత్మహత్యలను నివారించేందుకు ముందుకు సాగుతోంది. గతంలో వీటిని అడ్డుకునేందుకు రైల్వేశాఖ అధికారులు పలుమార్లు చర్యలు తీసుకున్నప్పటికీ ఫలితం కానరాలేదు. ఈ తరుణంలో పాదచారులు, ప్రయాణికుల నిర్లక్ష్యానికి అడ్డుకట్ట వేసేందుకు కఠిన నిర్ణయాలు తీసుకుంది.

రైలు పట్టాలు దాటుతున్న పాదచారులు, ప్రయాణికుల ప్రవర్తనలో మార్పు తీసుకొచ్చి వారి ప్రాణాలను కాపాడేందుకు రైల్వేశాఖ సిద్ధమైంది. ఆదమరిచి ట్రాక్‌ దాటుతున్న వారిని స్థానిక రైల్వే సిబ్బంది లేదా సీసీ కెమెరాల ద్వారా గుర్తించి కేసులు నమోదు చేయనుంది. ఆరు నెలల జైలు శిక్షతోపాటు, వెయ్యి రూపాయల జరిమానా విధించనున్నారు. సెక్షన్‌ 147 ద్వారా పట్టాలు దాటే పాదచారులను కట్టడి చేసి వారి ప్రాణ రక్షణకు రైల్వేశాఖ చర్యలు తీసుకోనుంది.

సెక్షన్‌ 147ను త్వరలో దేశ వ్యాప్తంగా అమలు చేయనుంది. పశ్చిమ రైల్వే విభాగంలో అమలుకానున్న ఈ విధానాన్ని రాబోయే రోజుల్లో దక్షిణ మధ్య రైల్వేలో కూడా ప్రవేశపెట్టనున్నట్టు సమాచారం. రైల్వేస్టేషన్లలో దొంగతనాలను నివారించి ప్రయాణికుల సొమ్ముకు భద్రత కల్పిస్తున్న రైల్వేశాఖ తాజాగా వారి ప్రాణాలను కాపాడేందుకు పలు నిర్ణయాలు తీసుకోవడంపై హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here